![]() |
.webp)
(డిసెంబర్ 22 జయమాలిని పుట్టినరోజు సందర్భంగా..)
‘సన్నజాజులోయ్.. కన్నె మోజులోయ్..’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘నీ ఇల్లు బంగారంగానూ..’, ‘గు గు గుడిసుంది..’, ‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ 1970వ దశకంలో వచ్చిన ఇలాంటి పాటలు అప్పటి కుర్రకారుకి పిచ్చెక్కించాయి. ఈ ఐటమ్ సాంగ్స్‌లో జయమాలిని డాన్స్, అందాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పించాయి. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో జయమాలిని ఐటమ్ సాంగ్ కంపల్సరీగా ఉండాల్సిందే. అక్క జ్యోతిలక్ష్మీ అప్పటికే తన డాన్స్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్నారు. ఆ సమయంలో వచ్చిన చెల్లెలు జయమాలిని.. ఐటమ్ సాంగ్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
1958 డిసెంబర్ 22న మద్రాస్‌లో జన్మించారు జయమాలిని. ఆమె అసలు పేరు అలమేలు మంగ. 8 మందిలో జ్యోతిలక్ష్మీ మొదటి సంతానం కాగా, అలమేలు మంగ చివరి సంతానం. ఈ ఇద్దరికీ 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. తల్లికి చెల్లెలైన ధనలక్ష్మీకి పిల్లలు లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా ఆమె దగ్గరే జ్యోతిలక్ష్మీ పెరిగారు. అక్క డాన్స్ నేర్చుకుంటూ ఉండగా దగ్గరే ఉండి చూసేవారు అలమేలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్ నేర్చుకున్నారు.
అలమేలు మేనమామ టి.ఆర్.రామన్న ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో రవిచంద్రన్, లత జంటగా రూపొందుతున్న ‘స్వర్గత్తిల్ తిరుమనం’ సినిమాలో లత స్నేహితురాలిగా అలమేలును చిత్ర రంగానికి పరిచయం చేశారు. అప్పటికి అలమేలు వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత దర్శకుడు బి.విఠలాచార్య చేస్తున్న ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ఒక ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు జయమాలిని అని పేరు పెట్టింది కూడా ఆయనే.
అదే సంవత్సరం అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించారు జయమాలిని. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కంటే ఐటమ్స్‌తోనే జయమాలిని ఎక్కువ పాపులర్ అయ్యారు. 1977లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమగోల చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను, గుంటూరు పొయ్యాను..’ పాటతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్ చేశారు జయమాలిని. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లో వరసగా ఐటమ్ సాంగ్స్ చేశారు. అందరు టాప్ హీరోల సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసినప్పటికీ ఎన్టీఆర్ సినిమాలతోనే ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చిందనేది వాస్తవం.
1980వ దశకం వచ్చేసరికి జ్యోతిలక్ష్మీ హవా తగ్గింది. జయమాలిని జోరు పెరిగింది. ఆ తర్వాత సిల్క్ స్మిత వచ్చినప్పటికీ జయమాలిని ఇమేజ్ మాత్రం తగ్గలేదు. దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆమె కెరీర్లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాల్లో నటించారు.
ఐటమ్ సాంగ్స్‌తోపాటు విఠలాచార్య డైరెక్షన్లో వచ్చిన జగన్మోహిని, గంధర్వకన్య వంటి సినిమాలు జయమాలినికి నటిగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా జగన్మోహిని రిలీజ్ అయిన టైమ్‌కే ఎన్టీఆర్ సింహబలుడు, కృష్ణ సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.
నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1994 జూలై 19న పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు జయమాలిని. వీరి కుమార్తెకు చిన్నతనం నుంచే డాన్స్ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినిమా రంగానికి మాత్రం తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు జయమాలిని. పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. అంతేకాదు, మీడియాకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈమధ్యకాలంలోనే అక్కడక్కడా జయమాలిని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
జయమాలినిది ఒక విభిన్నమైన మనస్తత్వం. సినిమాల్లో కనిపించే జయమాలినికి, బయట కనిపించే జయమాలినికి అసలు పొంతనే ఉండదు. తెరపై ఐటమ్ గళ్‌గా కనిపించే ఆమె నిజజీవితంలో ఒక సాధారణ మహిళ అనిపిస్తుంది. మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన కెరీర్‌ని ఎంతో వైవిధ్యంగా కొనసాగించారు. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నానని, అందుకే సినిమాలకు స్వస్తి పలికానని చెబుతారామె. ఏది ఏమైనా తన ఐటమ్ సాంగ్స్‌తో 20 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన జయమాలిని అందరి మనసులు గెలుచుకున్నారు.
![]() |